Mana Enadu : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections 2024) తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జమ్ము ప్రాంతంలో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 39.18 లక్షల మంది ఓటర్లు ఈ దశలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బరిలో 415 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రులు తారా చంద్ (Congress), ముజఫర్ బెయిగ్ (Congress) ఉన్నారు.
5,060 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిమిత్తం దాదాపు 20 వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. 370 రాజ్యాంగ అధికరణం రద్దు తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు (Jammu Kashmir Results 2024) ఉంటుంది.
జమ్ముకశ్మీర్ తుది దశ పోలింగ్ వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు, పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువతే కాకుండా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్ పాల్గొంటారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
జమ్ముకశ్మీర్ ఎన్నికల తొలి విడతలో 61.38 శాతం, రెండో విడతలో 57.31 శాతం పోలింగ్ (Jammu Kashmir Polling) నమోదైంది. మూడో విడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్ లక్ష్యంగా కేంద్ రఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రెండు దశల్లో 50 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 17 స్థానాల్లో పురుషులతో పోలిస్తే మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ రాజీవ్ కుమార్ (CEO Rajeev Kumar) తెలిపారు.