
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel Collapse)లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ బృందాలు ఇంకా శ్రమిస్తున్నాయి. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నేటితో 14 రోజులు పూర్తవుతోంది. రెండు వారాలైనా అందులో చిక్కుకున్న వారి జాడ కానరాలేదు. అయితే వారి ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీమ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
టన్నెల్లోకి క్యాడవర్ డాగ్స్
కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ (cadaver dogs) బృందాన్ని రప్పించి వాటిని టన్నెల్లోకి తీసుకెళ్లింది. తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్ తో పంపి, వాటితోపాటు 110 మంది సిబ్బంది లోనికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్నా గుర్తించగల సామర్థ్యత క్యాడవర్ డాగ్స్ ది. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీమ్ వాటిని రంగంలోకి దింపింది.
రెస్క్యూలో పురోగతి లేదు
అయితే అన్వేషణ అనంతరం క్యాడవర్ డాగ్స్ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి వెనక్కి వస్తుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను, ఘటనా స్థలిలో పరిస్థితులను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైతే చిక్కుకున్న వారి ఆచూకీ విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.