సొంత పార్టీపై జీవన్ రెడ్డి ఫైర్.. కేటీఆర్ రియాక్షన్.. రంగంలోకి మహేశ్ కుమార్ గౌడ్

Mana Enadu : సొంత పార్టీపైనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ.. పార్టీ సేవకే అంకితమైన ఆయన తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ప్రధాన అనుచరుడు హత్యకు గురి కావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) స్పందిస్తూ జీవన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు. మరోవైపు ఈ వ్యవహారం మరింత ముదరకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇంతకీ ఏం జరిగింది?

జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి హత్యకు గురయ్యారు. ప్రధాన అనుచరుడి హత్య గురించి తెలియగానే ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి (Jeevan Reddy Follower Murder) జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని ఆయన హత్యను నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకుల్నే ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లేనని వ్యాఖ్యానించారు.

మీకో దండం.. మీ పార్టీకో దండం

ఈ సందర్భంగా  కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోనే తనకు తమ్ముడిలాంటి వాడిని కోల్పోయానని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ మీకు.. మీ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి. మాకు నలుగురికి సేవ చేయడమే తెలుసు. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తాను. ఇక మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి. ఇంతకాలం అవమానాలకు గురైనా తట్టుకున్నాం. మానసికంగా అవమానాలకు గురవుతున్నా భరించాం. కానీ ఇవాళ భౌతికంగా లేకుండా చేస్తే ఎందుకు’ అని అడ్లూరి లక్ష్మణ్‌(Adluri Lakshman)తో జీవన్‌ రెడ్డి చేసిన ఈ  వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

మేం ఎప్పటినుంచో ఇదే చెబుతున్నాం

మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రానికి పూర్తి స్థాయి హోంమంత్రి లేకపోగా.. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా బిజీగా ఉండటంతో శాంతి భద్రతల అమలు కుంటుపడింది. రాజకీయ పెద్దలు ఇకనైనా విజ్ఞతతో ఆలోచిస్తారని అనుకుంటున్నాను. శాంతి, సామరస్యాన్ని కాపాడే ప్రాథమిక పనిపై దృష్టి సారించేలా సమర్థులైన పోలీసులు అధికారులకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఆయన బాధలో అలా అన్నారు

ఇక ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ (Mahesh Kumar Goud) స్పందిస్తూ.. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుచరుడి హత్యపై అనుచరుడు హత్యకు గురి కావడంతో జీవన్‌ రెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని అన్నారు. ఆయన బాధలో ఉండి అలా తన ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. తాను జీవన్‌ రెడ్డితో ఫోన్లో మాట్లాడంతో పాటు పోలీసులతో కూడా మాట్లాడి హత్యకు సంబంధించిన సమాచారం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘హత్య చేసిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించాం. సీనియర్‌ మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu)కు ఈ వ్యవహారం అప్పగించాం.’ అని మహేశ్‌గౌడ్‌ తెలిపారు.

Share post:

లేటెస్ట్