Mana Enadu : భారత గోల్డెన్ బాయ్, బల్లెం వీరుడు, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) త్రుటిలో స్వర్ణం మిస్ అయ్యాడు. తాజాగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్ (Diamond League)లో నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. శనివారం జరిగిన ఈ పోటీలో అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటె విసిరాడు. కేవలం ఒక్క సెంటీమీటర్ తేడాతో మొదటి స్థానాన్ని, గోల్డ్ మెడల్ ను కోల్పోయాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్ అండర్సన్ 87.87 మీటర్లతో స్వర్ణం (Gold Medal) దక్కించుకుని నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
ఈ గేమ్‌లో తన మూడో ప్రయత్నంలో నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. లాస్ట్ అటెంప్టులో జావెలిన్ (Javeline)ను 86.46 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 85.97 మీటర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లోనూ నీరజ్‌కు రెండో స్థానమే దక్కిన విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లోనూ నీరజ్ రెండో స్థానంలో నిలిచి భారత్ కు రజత (Bronze Medal) పతకం తీసుకువచ్చాడు.
పలు కారణాలతో నీరజ్ జూరిచ్ డైమండ్ లీగ్‌లో పాల్గొనకపోయినా 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) గోల్డ్ మెడల్ విజేత, పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఈ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. కేవలం 5 పాయింట్లను మాత్రమే సాధించి అనర్హతకు గురయ్యాడు. మరోవైపు నీరజ్ చోప్రా దేశానికి ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలను అందించాడు.