భట్టి విక్రమార్క ఇలాకా మధిరలో బీఆర్ఎస్ కష్టమే!!

–నరేష్​ చిట్టూరి

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతున్న తరుణంలో పీక్స్ కు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పోటీ ఉన్న స్థానాల్లో మధిర ఒకటి. రెండున్నర లక్షలమంది ఓటర్లలో ఎనిమిదిన్నర వేల మందికి పైగా ఉన్న కొత్త ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ప్రధాన పార్టీలతో పాటూ, పలు ఇతర పార్టీలు, ఆరుగురు స్వతంత్రులు, మొత్తం 15 మంది బరిలో ఉండటంతో మధిర శాసనసభ నియోజక వర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఖమ్మం జిల్లా మధిర శాసనసభ స్థానం నుండి కాంగ్రెస్ లేజిస్లేచర్ పార్టీ నాయకుడు భట్టి విక్రమార్క పోటీ చేస్తూ ఉందటం తో రాష్ట్రం దృష్టి మధిర ఎన్నికపై పడింది.

వరుసగా మూడుసార్లు గెలుపొంది, పార్టీలో కీలకనేతగా ఎదిగిన భట్టి విక్రమార్క నాల్గొవసారి విజయం సాధించి హ్యట్రిక్​ కొట్టబోతున్నారు. గత మూడుసార్లు పోటీచేసి భట్టి చేతిలో ఓటమిపాలయైన లింగాల కమల్ రాజు BRS అభ్యర్థిగా మళ్లీ పోటీ పడుతున్నారు.ఈసారి ఎలాగైనా మధిరలో బీఆర్ఎస్ జెండా పాతాలని లింగాల కమల్ రాజు శక్తి యుక్తులను ఒడ్డుతున్నారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు సాధ్యం కాక చివరి నిమిషంలో సీపీఎం తమ అభ్యర్థిగా పాలడుగు భాస్కర్ ను రంగంలో నిలిపింది. వీరు కాక బీజేపీ అభ్యర్థి పెరుమాళ్లపల్లి విజయరాజు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.2009లో మొదటి సారి మధిర నుంచి గెలిచిన భట్టి ఆనాడు సీపీఎం అభ్యర్థిగా పోటీచేసిన లింగాల కమల్ రాజుపై గెలుపొందారు. 2014లో కూడా సీపీఎం అభ్యర్థిగా ఉన్న కమల్ రాజు గత ఎన్నికల్లో BRS అభ్యర్థిగా పోటీచేసి మూడో సారి ఓటమి పాలయ్యారు. మళ్ళీ కమల్ రాజు BRS నుండి తలపడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం కావాలంటే కేసీఆర్ సర్కార్ ను ఆదరించాలని చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు తన చరిష్మాను ఉపయోగించుకొని గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా భట్టి విక్రమార్క ప్రచారం చేస్తున్నారు.

లింగాల కమల్ రాజుకు ఈ ఎన్నికలు తన రాజకీయ భవిష్యత్ ను తేల్చనున్నాయి. ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని BJP, CPIM అభ్యర్థులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మొత్తంగా 15 మంది మధిరపై పట్టుకోసం ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. కానీ భట్టికే అనుకూలంగా బలమైన గాలి వీస్తుందని చెప్తున్నారు.ఈసారి కూడా బీఆర్ఎస్ కు భంగపాటు తప్పదని అంటున్నారు.

 

Share post:

Popular