ManaEnadu : ఉల్లి ధర హాఫ్ సెంచరీ దాటేసింది. నీ దారిలోనే మేము అంటూ కూరగాయల ధరలు (Vegetables Price) కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలో కిలో రూ.38 నుంచి రూ.40 ఉన్న ఉల్లి ధర క్రమంగా పెరుగుతూ రూ.60 వరకు చేరింది. ప్రస్తుతం రైతు బజార్లో మహారాష్ట్ర ఉల్లి కిలో రూ.55, కర్నూలు ఉల్లి కిలో (Onion Price Hike) రూ.42 చొప్పున ధర పలుకుతోంది. గత వారంతో పోలిస్తే ధరల్లో కాస్త పెరుగుదల కనిపించిందని రైతులు అంటున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లోకి నిల్వల విడుదలకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నందున రెండ్రోజుల్లో ఉల్లి ధర తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
కూరగాయల రేట్లు డబుల్
ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు లేక, ఇప్పుడేమో అధిక వర్షాలతో కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో సాధారణంగా ఉన్న కూరగాయల ధరలు (Vegetables Rates Hike) ఇప్పుడు రెట్టింపయ్యాయి. అప్పుడు కిలో రూ.26 ఉన్న టమాటా (Tomato Price Today) ప్రస్తుతం రూ.40 పలుకుతోంది. ఇక బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.60లకు చేరింది. వంకాయ ధర రూ.28 నుంచి రూ.40, కాకర, బీర, కాలీఫ్లవర్, క్యారెట్, దొండ, చిక్కుళ్లు, బంగాళాదుంప ధరలు కిలో రూ.35 నుంచి రూ.45కు చేరాయి.
దిగొస్తున్న వంట నూనెల ధరలు
వంట నూనెల (Edible Oil Price)పై దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన వాటి ధరలు ఒక్కసారిగా పెరిగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో వంట నూనెల ధరలు మళ్లీ తగ్గాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటరు రూ.102 నుంచి రూ.110 మధ్య విక్రయిస్తుండగా.. పామోలిన్ ధర కూడా తగ్గింది.