
ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన (President Rule in Manipur) విధించారు. ఇటీవల ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయగా.. కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్ లో రోజురోజుకు పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి.
సీఎం రాజీనామా
ఈనెల 9వ తేదీన ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు ఆయన తన రాజీనామా (Biren Singh Resignation) లేఖను సమర్పించారు. ఫిబ్రవరి 10 నుంచి జరగనున్న మణిపుర్ అసెంబ్లీ సమావేశాల్లో (Manipur Assembly Sessions) బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు(ఫిబ్రవరి 7న) ప్రకటించింది.
రెండేళ్లుగా ఘర్షణలు
మణిపుర్‌లో (Manipur Riots) దాదాపు రెండేళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. 2023 సంవత్సరం మే 3వ తేదీన మొదలైన ఈ ఘర్షణల్లో ఎంతోమంది మాన, ప్రాణాలు నష్టం జరిగింది. దాదాపు 250 మందికిపైగా మరణించారు. 65వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ అక్కడ రోజూ ఏదోమూల ఘర్షణ చెలరేగుతూనే ఉంది.