హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై భాజపా నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రపూరితంగానే సీనియర్ నేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారన్న ఆయన 2024లో ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా తెదేపా, జనసేన సర్కారు ఏర్పడుతుందన్నారు. జగన్ ఏం చేస్తున్నారు, ఏం చేశారు అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబుని చూసి జగన్ భయపడుతున్నారని.. తప్పుడు విధానంపలో అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా ఎదుగుతారన్నారు. ప్రజల సేవ చేసే నాయకుడిగా ప్రజల సేవ కోసమే చంద్రబాబు జైలుకు వెళ్లారన్న రాజాసింగ్.. కోర్టు తప్పకుండా ఈ కేసులు కొట్టివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ పార్టీకి భాజపా మద్దతు ఉంటుందని రాజాసింగ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
హిందూ వ్యతిరేకి జగన్ అంటూ మొదటి నుంచీ రాజాసింగ్ ఆయన్ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో క్రైస్తవ మతమార్పిడీకి ప్రభుత్వ మద్దతు ఉందని, తితిదేకు సైతం ఓ క్రైస్తవున్ని ఛైర్మన్‌ను చేశారని ఇటీవలె రాజాసింగ్ మండిపడ్డారు.