విజయవాడ: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసే పోటీకి వెళ్లనున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవలె తేల్చి చెప్పారు. కుదిరితే భాజపాను సైతం కలుపుకోనున్నట్లు తెలిపారు. అయితే 125 అసెంబ్లీ స్థానాలకు గానూ 25 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో 3 జనసేనకు కేటాయించేందుకు తెదేపా అధినేత సుముఖంగా ఉన్నట్లు సమాచారం. లోక్‌సభ సీట్లలో కాకినాడ, నరసాపురం, అనకాపల్లి స్థానాలు ఇప్పటికే ఖరారు కాగా.. నరసాపురం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మళ్లీ గాజువాక నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో ఆ స్థానాన్ని సైతం జనసేనకు కేటాయించేందుకు తెదేపా సిద్ధమైంది.
గుంటూరు పశ్చిమం నుంచి నాదెండ్ల మనోహర్ పేరు ఇప్పటికే ఖరారైంది. రాజోలు నుంచి పవన్ సోదరుడు నాగబాబు, మిగతా స్థానాల నుంచి జనంలో మంచి గుర్తింపు, కొన్నాళ్లుగా అధికారపార్టీపై గట్టి పోరాటం చేస్తున్న నేతలకు కేటాయించేందుకు జనసేనాని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పీఠాన్ని బాబు, పవన్ చెరి కొన్నాళ్లు పంచుకునేందుకూ ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని తెలిసింది. జగన్ ను ఓడించాలంటే త్యాగాలు తప్పవని బాబు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
భాజపాకు 3 స్థానాలు : ఒకవేళ తెదేపా, జనసేనతో భాజపా కలిసి నడిస్తే.. మూడు అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు తెదేపా అధినేత సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు సీట్లు ఇప్పటికే ఖరారు కాగా.. మిగతా స్థానాల అభ్యర్థుల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. భాజపా నుంచి బలమైన నేతలు చాలామందే ఉండగా వారికి ఎమ్మెల్సీ స్థానాలు ఆఫర్ చేయనున్నారు.