#90’s- ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ (#90’s A Middle Class Biopic) అంటూ ఈటీవీ విన్ లో ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. 90లలో పుట్టిన వారు, వారి తల్లిదండ్రులు ఈ సిరీస్ కు చాలా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ సిరీస్ ను ఓటీటీలో తరచూ చూసే వాళ్లు చాలా మంది. ఇప్పుడు 90లలోని వారు తమ చిన్ననాటి జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకునే అవకాశం వచ్చింది.
హోమ్ టౌన్ టీజర్ ఔట్
90’s కిడ్స్ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా ‘హోమ్ టౌన్ (Home Town)’ అనే వెబ్ సిరీస్ త్వరలోనే మన ముందుకు రాబోతోంది. రాజీవ్ కనకాల (Rajeev Kanakala), ఝాన్సీ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఆహా (Aha) ఓటీటీ వేదికగా ఏప్రిల్ 4వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు. శ్రీకాంత్ దీనికి దర్శకత్వం వహించారు.
కలలు ప్రారంభమయ్యే ప్రాంతం
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉన్న ఈ టీజర్ (Home Town Teaser) ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. ‘కలలు ప్రారంభమయ్యే ప్రాంతం.. మొదటి ప్రేమను అనుభవించే చోటు.. ఎప్పటికీ నిలిచిపోయే స్నేహం’ అంటూ విడదీయరాని స్నేహాలు, కుటుంబ విలువలు తెలిసేలా ఈ సిరీస్ ను రూపొందించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సిరీస్ కూడా మనల్ని హాయిగా నవ్వించడమే కాదు ఎమోషన్స్ తో మన గుండె బరువెక్కేలా చేస్తుందని టీజర్ చూసిన నెటిజన్లు అంటున్నారు.






