ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల(AntiDrug ) దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ప్రముఖ నటులు రామ్ చరణ్(Ram Charan), విజయ్ దేవరకొండ(vijay Devarakonda), ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు(Dilraju) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. “రైజింగ్ తెలంగాణ” పేరుతో ఇలాంటి అద్భుతమైన అవగాహన కార్యక్రమానికి తనను ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చిన్నప్పుడు స్కూల్‌లో ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవాడినని గుర్తు చేశారు.
ఇటీవల స్కూల్‌ల బయట చిన్న పిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారనే వార్తలు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చే మత్తు కన్నా, చదువులో మంచి మార్కులు సాధించడంతో వచ్చే ఆనందమే గొప్పదని చరణ్ స్పష్టం చేశారు. అలాగే కుటుంబంతో గడిపే సమయం, స్నేహితులతో ఆనందంగా గడపడం ద్వారా కూడా నిజమైన సంతోషాన్ని పొందవచ్చన్నారు. డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవాలని చరణ్ సూచించారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వ్యక్తులను పరిశ్రమ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్ ముప్పు నుంచి సమాజాన్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను అంతా ప్రశంసించారు.






