
భారతీయ సినీ పరిశ్రమలో సౌత్ వర్సెస్ నార్త్ (South Vs North) అనే డిబేట్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదే. ఇప్పటికే ఈ విషయంపై చాలాసార్లు చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) కూడా ఈ విషయంపై పలుమార్లు తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించారు. అయితే తాజాగా ఓ ఆంగ్ల వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన బాలీవుడ్ సినిమా మేకింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వాళ్లంతా రీమేక్ హీరోలే
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్న రోజుల్లో సౌత్ హీరోలు హిందీ సినిమాలు రీమేక్ చేసేవాళ్లని రాంగోపాల్ వర్మ గుర్తు చేశారు. సౌత్‌లో ఉన్న ఆనాటి అగ్రహీరోలందరూ రీమేక్ చిత్రాల్లో నటించినవారేనని తెలిపారు. సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వారు నేర్చుకున్నారని వర్మ వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ అలా ఆలోచించట్లేదు
‘‘పుష్ప 2 (Pushpa 2 : The Rule)’ వంటి సినిమాలను తెరకెక్కించాలనే దిశలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఏమాత్రం ఆలోచించడం లేదని వర్మ అన్నారు. బాలీవుడ్ లో మ్యూజిక్ కంపెనీలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక హిందీ చిత్ర పరిశ్రమ రూపు మారిపోయిందని తెలిపారు. అలా హిందీ ఇండస్ట్రీ మ్యూజికల్ మూవీస్ వైపు మొగ్గడంతో.. ‘మైనే ప్యార్ కియా’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ వంటి సినిమాలు పుట్టుకొచ్చాయని చెప్పారు.
ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయింది
“ఇక కొత్తతరం దర్శకులు బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసిస్తూ.. విదేశీ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి సినిమాలే తెరకెక్కిస్తున్నారు. అలా బాలీవుడ్ నెమ్మదిగా తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మర్చిపోయింది. మాస్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడం పూర్తిగా మానేసింది. కానీ, సౌత్ లో తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణమైన సినిమాలే తీస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు’’ అని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.