Mana Enadu : కర్ణాటకలోని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామువరకు అకస్మాత్తుగా కురిసిన వానల(Bengaluru Rains) ధాటికి బాబూసాపాళ్య ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఆరు అంతస్తుల భవనం మంగళవారం సాయంత్రం కూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రమాదస్థలిలో 20 మందికి పైగా కార్మికులున్నారు. వారిలో 15 మందిని పోలీసులు, స్థానికులు, విపత్తు నిర్వహణ దళం సిబ్బంది రక్షించారు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదు(Bengaluru Building Collapse)కు పెరిగింది. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది మంగళవారం రోజున ఒక మృతదేహాన్ని వెలికితీయగా.. ఇవాళ మరో నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని చెప్పారు. వారి కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు.
అవినీతి సర్కారే ప్రాణాలు తీస్తోంది
ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బెంగళూరులో అక్రమంగా భవన నిర్మాణం జరగుతోందనే విషయం కర్ణాటక ప్రభుత్వాని(Karnataka Govt)కి తెలియకపోవడం దురదృష్టకరమని బీజేపీ విమర్శించింది. కర్ణాటకు అవినీతి అనే చెడ్డ పేరును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించింది. కేవలం పేదల భూములను దోచుకోవడం పైనే సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్(DK Shiva Kumar), మల్లికార్జున ఖర్గే దృష్టి సారించడం దురదృష్టకరమని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో ఇప్పుడు చూస్తున్నంత దుష్పరిపాలన ఎప్పుడూ చూడలేదని.. దీని వల్ల సామాన్యులు, అమాయకులే ప్రాణాలును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
బెంగళూరును ముంచెత్తిన వాన
మరోవైపు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామువరకు అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వరదల ధాటికి యలహంక కేంద్రీయ విహార్ ఆవరణలో అలారం వ్యవస్థ ఉన్న కార్లన్నీ ఒక్కసారిగా మోగడం ప్రారంభించాయి. సెల్లార్ లేని భవంతుల్లో దిగువ అంతస్తుల్లో ఉన్నవారు అప్రమత్తమయ్యేలోగానే వరద ముంచెత్తింది. వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్ పునరావాస కేంద్రాలకు తరలించింది.