Mana Enadu : దిల్లీ కాలుష్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. గాలి నాణ్యత తగ్గి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది. కాలుష్య నివారణకు పంజాబ్, హరియాణా ప్రభుత్వాలతో పాటు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదు
పర్యావరణ పరిరక్షణ(Environmental Law) చట్టానికి సవరణలు చేసి పూర్తిగా నిర్వీర్యం చేశారని కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించింది. పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. CAQM చట్టం ప్రకారం, బాధ్యులపై జరిమానా విధించే నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది.
అయినా చర్యల్లేవ్
పంజాబ్, హర్యానాలో పంటలు పండించిన తరువాత వాటి వ్యర్థాల(Crop Wastage)ను రైతులు తగులబెడుతుంటారన్న విషయం తెలిసిందే. ఆ పొగ, కాలుష్యం పక్కనే ఉన్న దిల్లీకి చేరుతోంది. ఇప్పటికే కాలుష్య కాసారంతో కొట్టుమిట్టాడుతున్న ఈ మహానగరాన్ని ఈ రాష్ట్రాల నుంచి వచ్చే పొగ మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక్కడి గాలి నాణ్యత(Delhi Air Pollution) మరింత క్షీణించి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది.
అసలేం చేస్తున్నారు
ఈ నేపథ్యంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వాయు కాలుష్యాన్ని(Air Pollution) అరికట్టడానికి అవసరమైన యంత్రాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. పంజాబ్(Punjab Govt), హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు పంట వ్యర్థాలు తగులబెట్టడాన్ని అరికట్టేందుకు సీఏక్యూఎం జారీ చేసిన ఆదేశాలు ఏమాత్రం అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారికి జరిమానా విధిస్తాం
అయితే కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి పది రోజుల్లోగా దీనికి సంబంధించిన నిబంధనలు జారీ అవుతాయని తెలిపారు. సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం, పంట వ్యర్థాలను తగులబెట్టే వారిపై జరిమానాలు విధిస్తామని వెల్లడించారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా(Haryana Govt) రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో పాటు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు సీఏక్యూఎం నోటీసులు జారీ చేసిందని ధర్మాసనానికి వివరించారు.