Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీ నుంచి థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్ల కలెక్షన్లు సంపాదించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పలు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
పుష్ప-2 స్క్రీనింగ్ లో అనూహ్య ఘటన
తాజాగా ముంబయిలోని ఓ థియేటర్‌లో పుష్ప-2 (Pushpa 2 Spray Incident) సినిమా ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి థియేటర్‌లో ఘాటైన స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. స్ప్రే ధాటికి చాలా మంది ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. అసలు ఆ వ్యక్తి ఏ స్ప్రే కొట్టాడో.. ఇలాంటి ఘటనకు ఎందుకు పాల్పడ్డాడో తెలియరాలేదు. అసలేం జరిగిందంటే..?
పుష్ప-2 ప్రదర్శనలో ఆడియెన్స్ కు వాంతులు
డిసెంబరు 5 గురువారం రాత్రి బాంద్రాలోని ఓ థియేటర్‌లో సెకండ్ షో పుష్ప-2 (Pushpa 2 Bandra Incident) సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. అయితే ఈ సమయంలో థియేటర్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఘాటైన స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. ఆడియెన్స్ ఇబ్బంది పడటంతో థియేటర్ యాజమాన్యం కాసేపు షోను నిలిపివేసింది.
థియేటర్ లో ఘాటైన స్ప్రే
ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు హాలులోని ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత అందరికీ దగ్గు, వాంతులు వచ్చినట్లు ప్రేక్షకులు తెలిపారు. ఇక పోలీసులు వచ్చి తనిఖీ చేసిన తర్వాత 20 నిమిషాలకు తిరిగి షో ప్రారంభమైంది.







