తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ రద్దు చేయనుంది. దాని స్థానంలో భూమాత తీసుకరానుంది. భూ పరిపాలనకు ఇప్పుడు అమలువుతోన్న ఆర్వోఆర్ యాక్ట్‌కి అనేక సవరణలు చేసే బదులుగా సమగ్ర, సత్వర, మేలైన సేవలందించేందుకు కొత్త చట్టాన్ని రూపొందించనున్నారు.
ఈ మేరకు ధరణి కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనున్నది. శనివారం సీఎం రేవంత్ రెడ్డితో ధరణి కమిటీ భేటీ కానుంది. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో భేటీ అయి తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
ఇప్పటికే రెవెన్యూ సంబంధిత శాఖల అధికారులతో కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసింది. శాఖల మధ్య సమన్వయలోపంతో తలెత్తిన వివాదాలు అనేకం దర్శనమిచ్చాయి. రైతుబంధు సొమ్ములు రూ.వేల కోట్లు వృథా అవుతున్నట్లు గుర్తించారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య అగాధమే కనిపించింది.
భూమాతకు ముందే క్లియరెన్స్
ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలను లక్షల్లోనే పరిష్కరించారు. ఐతే ఇంకనూ 2.36 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. అలాగే భూ రికార్డుల ప్రక్షాళన టైంలో పార్టు బి లోనూ నమోదు చేశారు. భూమాత వెబ్ పోర్టల్‌ని అమల్లోకి తీసుకొచ్చే ముందే వీటిని క్లియర్ చేయాలని కమిటీ అధికారులకు సూచించింది. కమిటీ సిఫారసులు రాలేదంటూ కొన్ని జిల్లాల్లో పరిష్కారించకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు.
ఈజీగా భూమాత ఆపరేటింగ్
ధరణి పోర్టల్‌లో 33 మాడ్యూళ్లు ఉన్నాయి. ఏ సమస్యలకు ఎలా అప్లయ్ చేసుకోవాలో సామాన్యులకు తెలియదు. ఆఖరికి మీ సేవా కేంద్రాల వారికీ తెలియదు. అన్నింటి కంటే 33 మాడ్యూళ్లల్లో ఏ దరఖాస్తును ఎలా పరిష్కరించాలన్న మార్గదర్శకాలేవీ రూపొందించలేదు. సీసీఎల్ఏ నుంచి కలెక్టర్లకు అందలేదు. కలెక్టర్ నుంచి తాసిల్దార్కు రాలేదు. దాంతో చాలా వరకు పెండింగులో ఉన్నాయి. నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాసిఫికేషన్ చేంజ్ వంటి విషయాల్లో చాలా తప్పులు జరిగాయి.