Mana Enadu: అసలే వానాకాలం.. కురిస్తే ఒకేసారి భారీ వర్షం.. తర్వాతి రోజు మళ్లీ ఎండ తీవ్రత.. లేదంటే 2,3 రోజుల పాటు ముసురు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొంది. దీంతో దోమల బెడద పెరగడంతో పాటు రకరకాల వైరస్‌లు విజృంభిస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ వంటి ఇతర కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డెంగీ కలవరపెడుతోంది. పల్లెల్లో కంటే పట్టణాల్లోనే ఈ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. అయితే డెంగీ,మలేరియా వస్తే ప్రధానంగా వచ్చే సమస్య ప్లేట్స్ తగ్గిపోవడం. ప్లేట్స్ తగ్గిపోతే ఏం చేయాలో వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
ప్లేట్‌లెట్స్ ఎప్పుడు ఎక్కించాలి?
ప్లేట్‌లెట్స్ ఎముక మజ్జలో ఏర్పడతాయి. శరీరానికి గాయం తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలో క్యూబిక్ మిల్లీ మీటర్ పరిమాణంలో 1.5 లక్షల నుండి 4.5లక్షల ప్లేట్ లెట్స్ ఉండాలి. కానీ డెంగీ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ఈ సమయంలో రక్తం గడ్డగట్టే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య 20,000కు పడిపోతే పేషంట్ ప్రమాదకర స్థితిలోకి చేరుకుంటారు. ప్లేట్‌లెట్స్ సంఖ్య 10 వేలకు తగ్గితే నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు పొరల్లోంచి రక్తస్రావం అవుతుంది. ఈ సమయంలో తప్పనిసరిగా ప్లేట్ లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.
డెంగీ నుంచి అప్పుడే కోలుకున్నట్లు
డెంగీలో జ్వరం తగ్గిన వెంటనే కోలుకున్నట్లు భావించకూడదు. జ్వరం తగ్గాక రక్తపోటు, ప్లేట్‌లెట్లు పడిపోయే ప్రమాదం ఉంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయి.. నాడీ వేగం, బీపీ, శ్వాస తీసుకోవటం మామూలు స్థితికి వచ్చినప్పుడే డెంగీ నయమైనట్లు భావించాలి. వాంతులు, కడుపునొప్పి పూర్తిగా తగ్గి.. ఆకలి పెరిగి, హిమోగ్లోబిన్ స్థాయులు స్థిరంగా ఉన్నప్పుడే మనం డెంగీ నుంచి పూర్తిగా రికవరీ అయినట్లు భావించాలి. అప్పటి వరకు వైద్యుని సూచనలు తప్పక పాటించాలి. దాంతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి తలుపులు, కిటికీల నుంచి దోమలు రాకుండా మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలి. దోమ తెరలను ఉపయోగించాలి.









