ManaEnadu:అసలే వర్షాకాలం (Monsoon). మొన్నటిదాక భారీ వర్షాలు, వరదలు. ఇప్పటికే దోమలు, ఈగలతో జనం సతమతమవుతున్నారు. సీజనల్ వ్యాధులు (Seasonal DIseases) చుట్టుముట్టేసి ఇంటిళ్లిపాది ఆస్పత్రులకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే జ్వరాలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటినిండా చెత్త ఉంటే ఇంకెన్ని వ్యాధులు చుట్టుముట్టుతాయో చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాలను ఈ చెత్త సమస్య ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
లోడింగ్ ఓకే.. అన్‌లోడింగ్ ఏది?
ప్రతిరోజులానే నగరం(Hyderabad)లో చెత్తను సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇళ్లకు వస్తున్నారు. చెత్త లోడ్ చేసుకుని ఆటోల్లో వెళ్తున్నారు. అయితే ఈ చెత్తను అన్‌లోడింగ్ చేయడంలో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాంకీ సంస్థ (Ramky Group) ఆటోల నుంచి చెత్తను అన్‌లోడింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిసింది. చెత్తను అన్‌లోడ్ చేసేందుకు సరిపడా డబ్బాలు కేటాయించకపోవడంతో సేకరించిన చెత్త అంతా ఆటోల్లోనే ఉంటోంది.
డబ్బాల్లేవ్..
దీనివల్ల మరింత చెత్త సేకరణకు ఆటోలు (GHMC Autos) కరవైపోయాయి. దీంతో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్తను తీసుకెళ్లేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారంపాటు చెత్త అంతా ఇంట్లోనే ఉండటంతో దోమలు, ఈగలతో వ్యాధుల బారిన పడుతున్నామంటూ వాపోతున్నారు.
రాంకీ సంస్థ నిర్లక్ష్యం..
మరోవైపు రాంకీ సంస్థ చెత్త అన్‌లోడింగ్‌కు డబ్బాలు కేటాయించకపోవడం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని జీహెచ్ఎంసీ ఆటో కార్మికులు వాపోతున్నారు. మొత్తం 364 ఆటోలు అన్‌లోడింగ్‌కు రెడీ ఉన్నాయని, ఒక్కో వాహనంలో దాదాపు 2 టన్నలు చెత్త ఉందని చెబుతున్నారు. ఆ సంస్థ చెత్తడబ్బాలు కేటాయించకపోతే చెత్త సేకరణకు మరింత ఇబ్బంది ఎదురువుతుందని, దానివల్ల ప్రజలకు అవస్థలు తప్పవని అంటున్నారు. వీలైనంత త్వరగా ఆ సంస్థ నిర్లక్ష్యం వీడి చెత్త డబ్బాలు కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు.