Mana Enadu:బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా రగిల్చిన అగ్నికి ఆ దేశ ప్రధాని పీఠం కదిలింది. మెల్లగా మొదలైన నిరసనలు ఆగ్రహజ్వాలలుగా మారి చివరకు పీఎంను గద్దె దించాయి. నిరసనలు.. అల్లర్లుగా మారిన ప్రతిక్షణాన్ని భారత్ నిశితంగా పరిశీలించింది. సోమవారం రోజున ఘర్షణలు తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీయడంతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దుల వద్ద బందోబస్తును పటిష్ఠం చేసింది.
ఇక పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేసి.. అటు నుంచి వచ్చే విమానాన్ని సురక్షితంగా భారత్ లో ప్రవేశించే వరకు ఓ కన్నేసి ఉంచాయి.
భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని పర్యవేక్షిస్తుండగా.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో షేక్ హసీనా ఉన్న విమానం రావడాన్ని పసిగట్టాయి. ఈ క్రమంలో ఆ విమానానికి రక్షణగా పశ్చిమ బెంగాల్‌లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్వ్కాడ్రన్‌లోని రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణించిన విమానానికి బిహార్, ఝార్ఖండ్ మీదుగా ఎస్కార్ట్ గా వచ్చాయి. అలా యూపీలోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షించాయి.
ఇక హసీనా భారత్ నుంచి లండన్ వెళ్లాలనుకున్నారు. అయితే బ్రిటన్ లో ఆశ్రయం పొందేందుకు అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించగా.. ఇంకా ఆ సర్కార్ దానిపై స్పందించలేదు. ఈ క్రమంలో తన భవిష్యత్ పై ఓ నిర్ణయానికి వచ్చే వరకు ఆమె భారత్ లోనే ఉంటారని కేంద్రం వెల్లడించింది.