ManaEnadu:శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. సోమవారం (ఆగస్టు 26వ తేదీన) దేశవ్యాప్తంగా ఈ పండుగను రంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన బాల గోపాలుడికి భక్తులు ఎంతో శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారు. ఉపావాసాలు, ఉట్లు కొట్టడం, గోపాలుడికి ఉయ్యాల సేవ వంటి వాటివి ఘనంగా నిర్వహిస్తారు. ఇక కన్నయ్య పుట్టిన రోజును ఆయనకు ఇష్టమైన అన్ని రకాల పదార్థాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
కృష్ణాష్టమి రోజున కన్నయ్యకు ఎక్కువగా పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ ఇలా వివిధ రకాల నేవైద్యాలను సమర్పిస్తారు. ఇక ఇవే కాకుండా ఈ నంద గోపాలుడికి అటుకులతో చేసిన వంటలంటే మహా ప్రీతి. తన స్నేహితుడు కుచేలుడు అటుకులు తీసుకువస్తే పరమానందంగా భావించి ప్రేమతో పెట్టేది ఏదైనా పంచభక్ష్య పరమాన్నం, అమృతంతో సమానం అని సేవించాడు ఆ కిట్టయ్య. అలాంటి కన్నయ్యకు పుట్టిన రోజున తన ఫేవరెట్ అటుకుల లడ్డూ పెడితే.. ఆయన కటాక్షం మెండుగా ఉంటుందని భక్తుల నమ్మకం. మరి ఈ అటుకుల లడ్డూ ఎలా చేయాలో తెలుసుకుందామా..
అటుకుల లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు :
అటుకులు – 2 కప్పులు
నెయ్యి – అరకప్పు
బెల్లం- కప్పు
పాలు- అరకప్పు
ఎండు కొబ్బరి- పావుకప్పు
యాలకులు -4
బాదం, జీడిపప్పులు – తగినన్నీ
అటుకుల లడ్డూ ఎలా చేయాలంటే.. :
మొదటగా అటుకులు జల్లించి ఆ తర్వాత కడాయిలో వాటిని వేసి సన్నటి మంటపై క్రిస్పీగా వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను వేసి దోరగా వేయించి.. వీటిలో యాలకులు కూడా కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన అటుకులు కూడా గ్రైండర్ లో వేసుకుని గ్రైండ్ చేయాలి.
ఇప్పుడు ఓ కడాయిలో కొత్తి నెయ్యి వేసుకుని బాదం, జీడిపప్ప వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టేసి.. అదే కడాయిలో బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. ఇక బెల్లం కరిగిన తర్వాత ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. మధ్యమధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇక ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేయించిన బాదం, జీడిపప్పులను వేసి కలపి.. కొద్దిగా నెయ్యి చల్లి చేతితో లడ్డూలను చేసుకుంటే వేడి వేడి టేస్టీ టేస్టీ అటుకుల లడ్డూలు రెడీ. ఈ కృష్ణాష్టమికి కన్నయ్యకు ఇష్టమైన ఈ అటుకుల లడ్డూలను నైవేద్యంగా మీరూ చేసి పెట్టండి.








