Mana Enadu:దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇవాళ మరో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. నిత్యం విచారణలతో బిజీబిజీగా ఉండే న్యాయస్థానంలో ఇవాళ సినిమా సందడి నెలకొంది. ప్రతిరోజు విచారణలతో తీరిక లేకుండా ఉండే సీజేఐ, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇవాళ సరదాగా కుటుంబంతో కలిసి సినిమా చూశారు. అదేంటి.. కోర్టులో సినిమా చూడటమేంటి అనుకుంటున్నారా..
సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో ఇవాళ సాయంత్రం 4.15 గంటల నుంచి ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, ఆ సినిమా డైరెక్టర్ కిరణ్ రావ్ ఈ స్క్రీనింగ్ కు స్పెషల్ గెస్టులుగా వచ్చారు.
ఆమిర్ ఖాన్ తో కలిసి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు, లాయర్లు సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమిర్ వస్తున్నట్లు అనౌన్స్ చేసిన సందర్భంలో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సరదాగా ‘‘కోర్టులో తొక్కిసలాట తరహా పరిస్థితిని నేను కోరుకోను. కానీ ఈరోజు ఇక్కడ ఆమిర్ ఉన్నారు..’’ అంటూ చమత్కరించారు.
లాపతా లేడీస్ స్టోరీ ఏంటంటే..
2001లో ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లింగ సమానత్వాన్ని చాటిచెప్పే ఈ కామెడీ డ్రామా ఫిల్మ్.. ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకున్నా.. ఓటీటీలో మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో నితాన్షీ గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు. సుప్రీంకోర్టులో ‘లాపతా లేడీస్’ స్క్రీనింగ్.. వీక్షించిన సీజేఐ.. స్పెషల్ గెస్టుగా ఆమిర్ ఖాన్