Mana Enadu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మురారి. ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం రీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో డైరెక్టర్ కృష్ణవంశీ నెటిజన్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు తాపీగా సమాధానాలిస్తున్నారు. ఇందులో భాగంగాన మురారి సీక్వెల్ గురించి ప్రస్తావన వచ్చింది. దానిపై కృష్ణవంశీ ఏమన్నారంటే..?
ఓ రెండేళ్ల తర్వాత మహేశ్ బాబు తనయుడు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘మురారి’ సీక్వెల్ తీయండి సార్ అని ఓ నెటిజన్ కృష్ణవంశీని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘ఆ విషయాన్ని మీరు, నేను చెప్పకూడదు. మహేశ్, నమ్రత, గౌతమ్ డిసైడ్ చేయాలి. కాబట్టి వాళ్లనే డిసైడ్ చేయనిద్దాం’’ అని బదులిచ్చారు.
మరో నెటిజన్.. ‘‘పవన్‌కల్యాణ్‌కు మీరు ఎప్పుడైనా స్టోరీ చెప్పారా? మీ కాంబో అదిరిపోతుంది’’ అని అడగ్గా.. ‘‘చెప్పాను. సినిమా చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. ఆ ఛాన్స్ మిస్ అయింది. ఒకవేళ ఆ సినిమా వచ్చి ఉంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాస్ట్ అయ్యేది. నా బ్యాడ్ లక్ ’’ అని అన్నారు. ‘‘మీరు ఏం చేస్తారో తెలియదు. మాకు మీ నుంచి మురారి లాంటి చిత్రాలు కావాలి అది మీదే బాధ్యత’’ అని నెటిజన్ అనగా .. ‘‘సరే డబ్బులు తీసుకుని వచ్చేయండి. సినిమా తీద్దాం’’ అని సరదాగా బదులిచ్చారు.
కృష్ణవంశీ – మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘మురారి’లో సోనాలీ బింద్రే కథానాయిక. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ‘మురారి’ రీరిలీజ్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘మురారి’ 4k వెర్షన్ ప్రదర్శించారు. దాదాపు రూ.7 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టినట్లు అంచనా.