2023 లో టాలీవుడ్ టాప్ హీరోలు కొందరు థియేటర్లలో సందడి చేయలేదు. వారివి ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. ఇంతకీ ఎవరా నటులు.
Year End Roundup 2023 : ఏటా ఏదో ఒక సినిమాతో థియేటర్లను పలకరించే టాప్ హీరోలు కొందరు ఈ ఏడాది సందడి చేయలేదు. వారికి సంబంధించి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీరిలో ఎవరి సినిమా విడుదలకు నోచుకోలేదు. షూటింగ్స్ వాయిదా పడటం కావచ్చు.. మరే ఇతర కారణాలు కావచ్చు ఈ ఏడాది వీరి సినిమాలు విడుదల కాక ఫ్యాన్స్ మాత్రం నిరాశ పడ్డారు.
రామ్ చరణ్ : ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఎప్పుడా? అని ఎదురుచూసిన అభిమానులకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ఆచార్యలో గెస్ట్ రోల్‌లో కనిపించిన రామ్ చరణ్ పూర్తిస్ధాయిలో చేసిన ఏ ఒక్క సినిమా థియేటర్లకు రాలేదు. శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వాయిదా పడుతూ రెండు సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. 2024 లో ఈ సినిమా విడుదల కానుంది.
జూనియర్ ఎన్టీఆర్ : RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏ ఒక్కటి థియేటర్లలోకి రాలేదు. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘దేవర’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న దేవర కూడా 2024 లో థియేటర్లలోకి వస్తోంది.
మహేష్ బాబు : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఈ ఏడాది థియేటర్లను పలకరించాల్సి ఉంది. కొన్ని అవాంతరాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈ సినిమా జనవరి 12, 2024 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.