Mana Enadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులనూ మెప్పించింది. జూన్ 27వ తేదీన థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది కల్కి టీమ్.
ఆగస్టు 23 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు సమాచారం. దీని హిందీ వెర్షన్ మాత్రం అదే తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ అయి 40 రోజులు దాటింది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తుందని ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, దిశా పటానీ తదితురులు నటించారు.
కల్కి కథ ఏంటంటే: కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే స్టోరీ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ, అప్పటికి చివరి నగరంగా మిగులుతుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ (కమల్‌హాసన్). కాశీలో బౌంటీ ఫైటర్ అయిన భైరవ (ప్రభాస్) యూనిట్స్‌ని సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లాలని కల గంటాడు.
అయితే సుప్రీం యాస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొని తీసుకెళ్తుంది. ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్-కె కోసం గర్భవతుల్ని చేసి, వారి నుంచి సీరమ్ సేకరిస్తూ ప్రయోగాలు చేస్తుంటారు. అలా సుమతి (దీపికా పదుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి ప్రెగ్నెంట్ అవుతుంది.
ఇంకోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి సుమతి అని బలంగా నమ్మి ఆమెను కాంప్లెక్స్ నుంచి బయటకు తీసుకువస్తారు. ఆ తర్వాత సుప్రీం యాస్కిన్ సైన్యం సుమతి కోసం వెతుకుతూ ఉంటోంది. మరి సుమతి వారికి చిక్కిందా? చిరంజీవి అయిన అశ్వత్థామకీ, భైరవకీ సంబంధం ఏమిటి? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ – కె లక్ష్యమేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.






