ManaEnadu:పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics) ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే వేదికగా మరో క్రీడావేడుక షురూ కాబోతోంది. ఇవాళ్టి (ఆగస్టు 28వ తేదీ) నుంచి పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రీడల్లో 168 దేశాల నుంచి 4400 మంది దివ్యాంగ అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. డిలా కాంకార్డ్ వేదికగా పారాలింపిక్స్ ప్రారంభోత్సవం జరగనుంది. సెప్టెంబర్ 8వ తేదీన ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.
పారా ఒలింపిక్స్ (Paralympics 2024)లో మహిళలకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈసారి 10 కొత్త ఈవెంట్లను తీసుకొచ్చారు. ఈ పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తరఫున 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. టేబుల్ టెన్నిస్ (Table Tennis), రోయింగ్ (2), పారా కనోయింగ్ (3), పవర్‌లిఫ్టింగ్ (4), ఆర్చరీ (6), అథ్లెటిక్స్(38), తైక్వాండో, షూటింగ్ (10), బ్యాడ్మింటన్ (13), స్విమ్మింగ్ (1), సైక్లింగ్, జూడోలో పోటీ పడుతున్నారు.
2020 టోక్యో పారాలింపిక్స్ (Tokyo Paralympics )లో భారత్ 5 గోల్డ్ మెడల్స్ సహా 19 పతకాలను దక్కించుకుంది. ఈ సారి పారిస్ పారాలింపిక్స్‌లో 25 మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరంభోత్సవ వేడుకలో సుమిత్ అంటిల్ (అథ్లెటిక్స్), భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరిస్తారు. , కొంగనపల్లి నారాయణ (రోయింగ్, నంద్యాల), జీవాంజి దీప్తి (400 మీటర్ల టీ20 పరుగు, వరంగల్), రొంగలి రవి (షాట్‌పుట్, అనకాపల్లి), షేక్ అర్షద్ ( తైక్వాండో, నంద్యాల) తెలుగు రాష్ట్రాల నుంచి పారా ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నారు. ఇక తొలిసారిగా భారత్ అంధుల జూడో, రోయింగ్, సైక్లింగ్ అథ్లెట్లను రంగంలోకి దింపింది.








