Mana Enadu: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రచారంలోనైనా.. ప్రజల్లోకి వెళ్లడంలోనైనా ఈయన రూటే సపరేటు. సాక్షాత్తు రాజకుమారుడు తమ మధ్యకు వచ్చి ముచ్చటిస్తున్నట్లు ఉంటుంది ఈయన జనంలోకి వెళ్లినప్పుడు. అలా ఏదో మీటింగ్‌కు వెళ్తూ మధ్యలో కారు ఆపి రోడ్డు పక్కనే ఉన్న బండిలో చాయ్ తాగుతారు.. ప్రచారానికి వెళ్తూ.. పక్కనే కనిపించిన బజ్జీల బండి వద్దకు బజ్జీలు వేస్తూ వాళ్ల కష్టసుఖాలు తెలుసుకుంటారు. జనంలోకి వెళ్లడంలో రాహుల్‌ది చాలా డిఫరెంట్ అప్రోచ్.
అలాగే తాజాగా ఆయన పరువు నష్టం కేసులో ఉత్తర్ ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో సుల్తాన్‌పుర్ శివారులోని విధాయక్ నగర్‌లోని రోడ్డు పక్కనే ఓ చిన్న చెప్పుల దుకాణం నడుపుకుంటున్న రామ్ చేత్ అనే వ్యక్తి వద్దకు వెళ్లారు రాహుల్. ఆయనతో కాసేపు ముచ్చటించి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అంతే కాకుండా ఆయనకు సాయం చేస్తూ చెప్పులు కూడా కుట్టారు. అలాగే ఓ షూ కూడా తయారు చేశారు. ఆ తర్వాత ఆయన పడుతున్న కష్టాలు తెలుసుకుని సాయం చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కేవలం మాట ఇవ్వడమే కాదు.. మరుసటి రోజే చెప్పులు కుట్టే కుట్టు యంత్రాన్ని పంపించి రామ్ చేత్‌కు సాయం చేశారు. తన మాట నిలబెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు రామ్ చేత్ దుకాణానికి కస్టమర్లు పెరిగిపోయారు. ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ వైపునకు వెళ్తున్న వారంతా ఆగి మరి ఆయనతో మాట్లాడుతున్నారు. సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అంతే కాదండోయ్.. రామ్ చేత్ చెబుతుండగా.. రాహుల్ కుట్టిన చెప్పుల కోసం చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారట. ఒకరైతే ఏకంగా ఆ స్లిప్పర్స్‌కు రూ.10 లక్షలు ఇస్తున్నామని తనకు అమ్మమని అడిగారట. మరొకరైతే.. ‘బ్యాగు నిండా డబ్బిస్తా.. ఇచ్చేయ్’ అన్నారట.
అయితే, ఆ స్లిప్పర్స్‌ను విక్రయించబోనని, రాహుల్‌కి గుర్తుగా తన వద్దే ఉంచుకుంటానని రామ్ చేత్ చెబుతున్నారు. రాహుల్ రాకతో తన షాప్‌నకు డిమాండ్ పెరిగిందని.. భలే గిరాకీ వస్తోందని అంటున్నారు. రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులను ఓ గ్లాస్ ఫ్రేమ్‌లో భద్రపరచనున్నట్లు వెల్లడించాడు. రాహుల్ గాంధీ తన వద్దకు రావడం, తన జీవితాన్నే మార్చేసిందని రామ్ చేత్ పేర్కొన్నారు. మొత్తానికి రాహుల్ రాక రామ్ చేత్ లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా మారిందన్నమాట.