ManaEnadu:కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు ఇవాళ (గురువారం )మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే విధుల్లో చేరాలని చెప్పింది. విధుల్లోకి చేరిన తర్వాత వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా తాము బాధ్యత తీసుకుంటామని వారికి భరోసా కల్పించింది. వైద్యులు విధులు నిర్వర్తించకపోతే రోగులకు ఇబ్బందులు ఎదురువుతాయని.. ఆందోళనతో పేదలు నష్టపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆసుపత్రుల్లో వసతులు, పని పరిస్థితులు ఎలా ఉంటాయో తాము అర్థం చేసుకోగలమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. తాను కూడా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లానని.. ఒకసారి తన కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఆ రోజు తాను నేలపైనే నిద్రించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. దాదాపు 36 గంటల పాటు వైద్యులు ఏకధాటిగా పని చేస్తుంటారని సీజేఐ వ్యాఖ్యానించారు. అలాంటి వైద్యులకు సరైన సౌకర్యాలు లేకపోవడం ఆందోళనకరమని అన్నారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తి అనంతరం ఆమెను అతికిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారం రేపడంతో సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన కోర్టు.. బెంగాల్ ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా డాక్టర్లు, మహిళల రక్షణకు ప్రముఖ డాక్టర్లు, నిపుణులు సహా 10 మంది సభ్యులతో జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.