ManaEnadu:తెలంగాణ రైతులకు ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో రైతు రుణమాఫీ చేయడం ప్రారంభించింది. అయితే ఎన్నికల హామీలో.. రూ.2 లక్షలు దాటి ఎక్కువ ఉన్న రైతులకు కూడా రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని.. పైన మిగిలిన మొత్తం వారే చెల్లించుకోవాలని స్పష్టం చేసింది. అయితే మొదటి దశలో లక్షకుపైగా, రెండో దశలో రూ.1.50 లక్ష, మూడో దశలో రూ.2 లక్షల రుణమాఫీ చేసింది.
రైతు భరోసా యాప్..
అయితే ఇందులో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అర్హులై ఉండి రేషన్‌కార్డు లేక, ఇతర కారణాల వల్ల చాలా మంది రైతులు రుణమాఫీ పొందలేకపోయారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరోవైపు రూ.2 లక్షలు దాటిన వారికి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయశాఖ అనుమతించింది. అంతేగాక రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ‘రైతుభరోసా పంట రుణమాఫీ యాప్’ను రూపొందించింది.
ఆదివారం రోజున ఈ యాప్‌ను అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించి.. రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేయాలని సూచించింది. అనంతరం రైతుల నుంచి ధ్రువీకరణపత్రం, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని తెలిపింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
రైతు భరోసా యాప్‌లో నమోదు ఇలా
రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయాధికారులు వెళ్తారు.
రైతుల రుణఖాతాలు, ఆధార్‌కార్డులను తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
రుణాలున్న భార్యాభర్తలే గాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు తీసుకుంటారు
కుటుంబ యజమానితో ధ్రువీకరణపత్రం తీసుకుంటారు.
వీటిని ధ్రువీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం(అటెస్టేషన్) చేసిన ధ్రువపత్రం కూడా తీసుకుంటారు.