ManaEnadu:చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో హైడ్రా (HYDRA) గుబులు రేగుతోంది. కనిపించిన భూమినల్లా ఆక్రమించుకుని ఆకాశాన్ని తాకేలా కట్టడాలు కట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఆకాశం తాకిన ఆ కట్టడాలను క్షణాల్లో నేలకూలుస్తోంది. అక్రమార్కుల పాటి ‘హైడ్రా’ ఉక్కుపాదం మోపుతోంది. కూల్చివేతలతో ఆక్రమణదారులను హైడ్రా హడలెత్తిస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్లోని పలువురు ప్రముఖులకు చెందిన కట్టడాల (Hydra Demolitions)ను నేలకూల్చిన హైడ్రా ఇప్పుడు తనకు వస్తున్న మద్దతు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా చెరువులు చెరబట్టి కట్టడాలు నిర్మించిన వారికి చెమటలు పట్టిస్తోంది. తాజాగా హైడ్రా హైదరాబాద్లోని దుర్గం చెరువులోని కాలనీలపై ప్రత్యేక దృష్టిసారించింది.
ఇక్కడి కట్టడాలను పరిశీలించిన హైడ్రా.. అక్రమంగా నిర్మించిన వాటిపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగాహైటెక్‌సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు చుట్టూ వెలిసిన వేలాది విలాసవంతమైన భవనాలకు ఒక్కొక్కటిగా నోటీసులు జారీ చేస్తోంది.
ఇటీవలే దుర్గం చెరువు కాలనీలో 204 ఇళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారి నిర్మాణాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి (CM Revanth Brother) ఇల్లు కూడా ఉంది.
మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉన్న తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ఈ ఇంటికి తాజాగా నోటీసులు అంటించారు. ఆయన ఇంటితో పాటు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేసి నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేసింది హైడ్రా.