ManaEnadu:గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు కేటాయించిన సెక్యూరిటీని నిరాకరిచారు. తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించారు. తాను ఎప్పటిలాగే సాధారణ పౌరుడిలా ఉంటానని చెప్పుకొచ్చారు.
తాను అలా ఉంటేనే ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తనకు తెలియజేసే అవకాశం ఉంటుందని వివరించారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం లేకపోలేదని కోదండరాం చెప్పారు. ఆయన నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయుకుడు మీలా ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నారు. మరోవైపు ఇంకొందరేమో.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రొటోకాల్స్ ఉంటాయని.. వాటిని పాటిస్తేనే పదవికి గౌరవం అంటూ కోదండరాం నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
మరోవైపు తాజాగా మీడియాతో ఇష్ఠాగోష్ఠిలో మాట్లాడిన కోదండరాం.. తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వస్తున్న వార్తలపై స్పందించారు. ఆ వార్తలన్నీ పుకార్లేనని.. అలాంటి ప్రతిపాదన ఏదీ తన వద్దకు రాలేదని తెలిపారు. మంత్రి పదవిపై ఇప్పటి వరకు తనను ఎవరూ సంప్రదించలేదని, దానిపై ఎలాంటి చర్యలు జరగలేదని స్పష్టం చేశారు. తనకు వచ్చిన పదవి చాలని, యువత కోసమే తాను ఈ పదవిని స్వీకరించానని వెల్లడించారు.
మరోవైపు ఇటీవల ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కోదండారాం ఖండించారు. ముఖ్యంగా సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహం రెండూ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. మరోవైపు రుణమాఫీ విషయంలోనూ ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని కోదండరాం మండిపడ్డారు.