ManaEnadu:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిలకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టారు. తాజాగా పోచారం శ్రీనివాస రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా నియమించారు. కేబినెట్ హోదాలో ఆయన్ను సలహదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు గుత్తా అమిత్ రెడ్డిని రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చూసిన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకం అవుతుందని భావించిన పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నిర్ణయం గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవంతో పాటు గౌరవమైన పదవులు కూడా లభిస్తాయని మాటిచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 21వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మరోవైపు మునుగోడు నుంచి ఎంపీ టికెట్ ఆశించి తీవ్రంగా భంగపడిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి చివరి నిమిషం వరకు టికెట్ కోసం ఆశించి చివరకు అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమిత్ నిర్ణయాన్ని సుఖేందర్ రెడ్డి కూడా సమర్థించారు. అయితే తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం అమిత్ కు రేవంత్.. కేబినెట్ హోదాలో పదవి ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.