Mana Enadu : ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మంటలు వ్యాపించి పది మంది శిశువులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అంతా భావిస్తున్న సమయంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..?
ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?
ఈ దుర్ఘటన(UP Hospital Fire Accident)కు ఓ నర్సు నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆరోపించారు. హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ అనే వ్యక్తి కుమారుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆయన ఘటనకు గల కారణాన్ని అధికారులకు వివరించారు.
ఆమే ఈ ఘటనకు కారణం
ఇంటెన్సివ్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ (Oxygen Cylinder) పైప్‌ను కనెక్ట్ చేస్తున్న సమయంలో దానిపక్కన మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించింది. ఆక్సిజన్ అధికంగా ఉన్న ప్రదేశం కావడంతో క్షణాల్లో మంటలు చుట్టుముట్టి ప్రమాదం జరిగింది. వెంటనే నలుగురు పిల్లలను నా మెడకు బట్టలో చుట్టుకొని బయటకు పరిగెత్తాను.
మిగతా వాళ్లను కాపాడలేకపోయాం
ఇతరుల సాయంతో మరి కొంతమంది చిన్నారులను కాపాడగలిగాం. మంటలు వ్యాపించడంతో ఆస్పత్రులో ఉన్న వారంతా భయంతో పరుగలు తీయడంతో తొక్కిసలాట జరిగి అనేక మంది గాయాలపాలయ్యారు. మంటలు అంటుకున్న సమయంలో సేఫ్టీ అలారాలు (Safety Alarms) మోగలేదు. ఎక్స్ పైర్ అయిన అగ్నిమాపక పరికరాలు ఉండడంతో అందరు చిన్నారులను రక్షించలేకపోయాం. అని భగవాన్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
బాధ్యులను వదిలేదే లేదు
మరోవైపు ఈ ఘటనకు బాధ్యులపైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ (UP Health Minister) స్పష్టం చేశారు. కాగా.. శుక్రవారం రాత్రి ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని శిశువులకు చికిత్స అందించే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా… ఆ వార్డులో చికిత్స పొందుతున్న 47 మంది చిన్నారుల్లో పది మంది చిన్నారులు మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi) మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.






