
‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది షాలినీ పాండే (Shalini Pandey). మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నా.. ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. అడపాదడపా వచ్చిన అవకాశాలతో తెలుగు, తమిళం ఇండస్ట్రీల్లో పలు చిత్రాలు చేసింది. ఇక ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టింది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ భామ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తోంది.
డోర్ కొట్టకుండా డైరెక్టు వచ్చేశాడు
అయితే డబ్బా కార్టెల్ (Dabba Cartel) ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలినీ పాండే కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి షేర్ చేసుకుంది. ఓ సినిమా షూటింగు సమయంలో కారవాన్ లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో డైరెక్టర్ డోర్ కొట్టకుండా డైరెక్టుగా వచ్చేశాడని తెలిపింది. సౌత్ ఇండస్ట్రీలో పని చేస్తున్న సమయంలో కారవాన్‌లో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో పర్మిషన్ లేకుండానే దర్శకుడు డోర్ తీశాడని షాలినీ చెప్పుకొచ్చింది. దీంతో కోపం వచ్చి అతడిపై కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని పేర్కొంది.
ఇప్పుడలాంటి సమస్యల్లేవ్
“డైరెక్టర్ పై కేకలు వేయడం కరెక్టు కాదని అప్పుడు అక్కడున్న వారంతా నాతో చెప్పారు. కానీ ఆ సమయంలో నాకు అదే కరెక్టనిపించింది. తప్పుగా అనిపించలేదు. అయితే ఆ తర్వాత నాకెప్పుడూ అలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఒకవేళ అలాంటి సమస్యలు ఎదురైనా డైరెక్టుగా ముఖం మీదే కోప్పడకుండా వారికి అర్థమయ్యేలా.. నా అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఎలా సమాధానం చెప్పాలో ఇన్నేళ్ల నా సినీ జర్నీలో తెలుసుకున్నాను.” అని షాలినీ పాండే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షాలినీ చెప్పిన ఆ సౌత్ డైరెక్టర్ ఎవరని నెట్టింట చర్చ జరుగుతోంది.