ManaEnadu:చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. సండే వచ్చిందంటే ఇంట్లో నాన్‌వెజ్ (Non Veg) ఉండాల్సిందే. అయితే ఎక్కువ మంది చికెన్‌ను ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మటన్, చేపలు (Fishes) ధర ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక ప్రొటీన్‌లు పుష్కలంగా ఉండే చికెన్‌ను నాన్ వెజ్ ప్రియులు చాలా ఇష్టంగా తింటారు. డైట్ చేసేవాళ్లు కూడా తమ డైట్లో చికెన్ తప్పకుండా ఉండేలా చూసుకుంటారు.
ఏది మంచిది?
చికెన్ ఫారమ్‌లో దొరికే బ్రాయిలర్ కోళ్ల (Broiler Chicken) కంటే నాటుకోడి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే నాటుకోళ్ల లభ్యత తక్కువగా ఉండటం, సిటీల్లో ఎక్కువగా దొరకకపోవడం, దొరికినా ధర కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది బ్రాయిలర్ చికెన్నే తింటున్నారు. అయితే ఈ ఫారమ్ చికెన్‌లో కొన్ని భాగాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని భాగాలు ఆరోగ్యానికి కీడు చేస్తాయని అంటున్నారు. మరి చికెన్ (Chicken)లో ఆరోగ్యానికి ఏవి మంచివి ఏవి మంచివికావో తెలుసుకుందాం.
చికెన్ స్కిన్ మంచిదా కాదా?
చాలామంది ఎక్కువగా స్కిన్లెస్ చికెన్ (Skinless Chicken) తినడానికే ఇష్టపడుతుంటారు. అయితే చికెన్ స్కిన్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. అందులో కొవ్వు అధికంగా ఉండి గుండెకు కీడు చేస్తుందట. అధిక రక్తపోటు ఉన్నవారికి స్కిన్ ఉన్న చికెన్ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కోడి చర్మం ఆరోగ్యానికి ప్రమాదకరమే అయినా అందులో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 (Omega 6 Fats) కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయట. అయితే గుండె జబ్బులు లేనివాళ్లు అరుదుగా నెలకు ఒకటి రెండు సార్లు స్కిన్‌తో కూడిన చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదేనట. మోతాదు మించితే మాత్రం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు.
చికెన్ బ్రెస్ట్ బెటర్
ఇక చికెన్ బ్రెస్ట్ (Chicken Breast) భాగంలో తక్కువ కొవ్వు , ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిదట. బరువును నియంత్రించడంలో కూడా తోడ్పడుతుందట. చికెన్ తొడ మాంసం కూడా మంచిదే అయినా బ్రెస్ట్ మాంసమే బెటర్ అంటున్నారు నిపుణులు. తొడ మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుందట. అదేవిధంగా చికెన్ వింగ్స్ (Chicken Wings)లో కూడా కొవ్వు, కేలరీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని ఫ్రై చేసి కాకుండా గ్రిల్ చేసుకుని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.