ManaEnadu:ఓ సినిమాలో హీరోయిన్ అంతేనా అంటే.. హీరో ఇంకేం కావాలి అంటాడు.. అప్పుడు హీరోయిన్.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటాడు. అయితే కుదిరితే మూడు కప్పుల కాఫీ తాగాలంటున్నారు చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్ కాలేజీ పరిశోధకులు. అదేంటి మూడు కప్పులు అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే మరి ఈ కాఫీ (Coffee) స్టోరీ చదివేయండి.
టీ Or కాఫీ ఏది బెస్ట్?
టీ (Tea) కంటే కాఫీ ఆరోగ్యానికి మేలని కొందరు.. లేదు కాఫీలో కెఫిన్ వల్ల క్యాన్సర్ వస్తుంది చాయ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని ఇంకొందరు. ఇలా దశాబ్దాల నుంచి టీ, కాఫీల్లో ఏది మంచిదో డిబేట్ జరుగుతూనే ఉంది. అయితే ఈ డిబేట్లో ఎక్కువగా కాఫీయే గెలుస్తూ వస్తోంది. కాఫీ తాగడం మంచిదేనని.. కానీ మోతాదుకి మించి తాగితే మాత్రం ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు.
మూడు కప్పుల కాఫీ మంచిదే
అయితే తాజాగా సమాచారాన్ని చైనా (China)లోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్ కాలేజీ పరిశోధకులు కాఫీపై పరిశోధన చేశారు. రోజుకు మూడు కప్పుల కాఫీ సేవించడం మంచిదని ఈ పరిశోధనలో కనుగొన్నారు. మూడు కప్పుల కాఫీ(Three Cups Coffee) తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. దీనివల్ల మధుమేహం (Diabetis), స్థూలకాయం, ఫ్యాటీ లివర్ వంటి అనారోగ్యాల ముప్పును 40 నుంచి 48 శాతం తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. కాఫీ తాగే 1.72 లక్షల మంది సమాచారాన్ని, వారి ఆరోగ్యాన్ని పరిశీలించి పరిశోధనలు చేసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు.
నాలుగు మాటలు.. మూడు కప్పుల కాఫీ
ఈ పరిశోధనలో రోజుకు మూడు కప్పుల కాఫీ తాగుతున్న వారెవరూ గుండె (Heart Problems) సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని గుర్తించారు. కేవలం గుండె సంబంధిత వ్యాధులే కాకుండా.. స్థూలకాయం, అధిక కొలెస్ట్రాల్ (Bad Cholesterol), మధుమేహం, ఫ్యాటీ లివర్ వ్యాధులు వృద్ధి చెందే ముప్పును 48 శాతం తగ్గించుకోగలిగారని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను క్లినికల్ ఎండోక్రోనాలజీ- మెటబాలిజం జర్నల్ ప్రచురించింది. అందుకే మీ మనసుకు నచ్చిన వారితో నాలుగు మాటలు మాట్లాడుకుంటూ రోజులో మూడు కప్పుల కాఫీ తాగేయండి మరి.








