Kadiyam Srihari: KTR, హరీశ్‌రావును పిచ్చికుక్కలు కరిచాయి.. కడియం హాట్ కామెంట్స్

తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్(BRS) అవినీతి పాలన సాగించిందని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి పాలనలో తాను భాగస్వామి కావొద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోకి వచ్చినట్లు తెలిపారు. గురువారం జనగామలో గ్రంథాలయ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే జనగామ గడ్డపై ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ వనరులను KCR, KTR, హరీశ్ రావులు కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతోనే ఫామ్ హౌస్‌లు, ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని విమర్శించారు.

 కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుంది

కేటీఆర్, హరీశ్‌రావులను పిచ్చికుక్కలు కరిచినట్లు అనుమానంగా ఉందని కడియం అన్నారు. రోజూ మీడియా, పత్రికల్లో కనిపించాలనే తపన తప్ప వారిలో మరేం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తప్పులు ఒక్కొక్కటిగా బయటపడతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి సరైన సూచనలు, తగిన సమయంలో విమర్శలు చేయాలి. కానీ ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెల్లారి లేస్తే నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని, అసలు రెండూ BRS పార్టీలోనే లేవని ఫైరయ్యారు. KCR కుటుంబ నేతలు, BRS నేతల పాపం ఏదో ఒకరోజు పండుతుందని, ఆ రోజు తప్పక అందరూ బయటపడాల్సిందేనని అన్నారు.

వారి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి

రైతులకు ఏకకాలంలో పంట రుణాలు మాఫీ(Runa Mafi) చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని కొనియాడారు. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి గద్దెనెక్కిన BRS పది సంవత్సరాలు ఏం చేసిందని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్, BJP చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వారి విష ప్రచారాలను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా(Congress social media) సిద్ధంగా ఉండాలని సూచించారు.

Share post:

లేటెస్ట్