Mana Enadu :టాలీవుడ్‌లో ఇటీవల కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్టుగా ఆసక్తికర చిత్రాలను అందిస్తున్నారు. ముఖ్యంగా చాలా మూవీస్ చిన్నగా రిలీజ్ అయ్యి.. కథా పరంగా ప్రేక్షకులను మెప్పించి సెన్సేషనల్ హిట్ గా మారిన సందర్భాలను చూశాం. తాజాగా ఇప్పుడు అలాగే సూపర్ సెన్సేషన్ గా మారేందుకు మరో మూవీ వచ్చేస్తోంది.
పొట్టేల్ కథ అదే
యంగ్ నటుడు యువచంద్రా కృష్ణ, అనన్య నాగళ్ల(Ananya Nagalla) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పొట్టేల్(Pottel)’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. పక్కా విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో ఎమోషనల్ రైడ్‌గా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 1980 కాలం నాటి తెలంగాణ పరిస్థితులను మేకర్స్ ఈ సినిమాలో చూపించారు.
పొట్టేల్ పరారీతో జీవితం తలకిందులు
కుమార్తె చదువు కోసం ఓ తండ్రి ఎదుర్కొనే సమస్యలు.. చదువు ప్రాముఖ్యతను వివరిస్తూ, మంచి మెసేజ్ ఇచ్చే కంటెంట్ తో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ (Pottel Trailer) చూస్తే తెలుస్తోంది. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మిన ఒక నిరుపేద.. తన కూతురు సరస్వతికి విద్యను అందించాలనుకుంటాడు. కానీ పేద, ధనికుల మధ్య తారతమ్యాలు చూపే ఆ ఊళ్లో పరిస్థితులు సరస్వతి చదువు సాగేందుకు అనుకూలంగా లేనట్లు వీడియోలో కనిపిస్తోంది. గ్రామ దేవతకు బలివ్వడానికి వదిలిన ఓ పొట్టేలు మిస్సవ్వడంతో ఆ పేదవాడి జీవితం తలకిందులైనట్లు ట్రైలర్ లో తెలుస్తోంది.
ట్రైలర్ చివరలో సూపర్ ట్విస్ట్
అయితే పొట్టేలును గాలికి విడిచిపెట్టి, కూతురు చదువు మీద దృష్టి పెట్టడం వల్లే అది గ్రామస్థులు ఆ పేదవాడిని నిందిస్తారు. ఊళ్లో జరిగే అనర్థాలన్నింటికి అతడే కారణమంటూ కొడతారు. దీంతో అతను తన కుమార్తెను తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించడం.. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే పరిస్థితులే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివరలో పొట్టేలు బదులు ఆ పాపని బలివ్వడానికి తీసుకెళ్తున్నట్లుగా చూపించి ప్రేక్షకులకు సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అక్టోబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.