Mana Enadu : సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయణ్ను ఇవాళ చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. మంగళవారం(అక్టోబర్ 1) ఉదయం వైద్యులు ఆయన పొత్తి కడుపులో స్టెంట్ వేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. మరో మూడు రోజుల పాటు ఆయణ్ను ఆసుపత్రిలోనే ఉంచనున్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. రజినీ కాంత్ ఆరోగ్యం (Rajinikanth Health Update)పై ఆయన భార్య లతా స్పందిస్తూ.. ప్రస్తుతం రజనీ కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.
మరోవైపు తలైవా ఆస్పత్రిలో చేరారన్న వార్తలతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సూపర్ స్టార్ (Rajinikanth Fans) త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంగా ఉన్నారన్న తాజా సమాచారంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా గెట్ వెల్ సూన్ తలైవా అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక రజినీ సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఆయన వెట్టయాన్ (Vettaiyan), కూలీ (Coolie) సినిమాల్లో నటిస్తున్నారు. వెట్టయాన్ మూవీ అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకులకు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో తలైవా పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్గా నటిస్తున్నారు. సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి (Rana Daggubati) కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి.జ్ఞాన్వేల్ దర్శకత్వం వహించారు.