ManaEnadu:మరో నాలుగు రోజుల్లో పెళ్లి ముహర్తం ఉండగా.. వరుడు కనిపించకుండా పోయాడు. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి మిస్సయ్యాడు. ఈ సమాచారం తెలిసిన బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే విషాదకర వార్త బయటకు వచ్చింది. SRSP కెనాల్‌లో కృష్ణతేజ్ మృతదేహం బయటపడటంతో కలకలం సృష్టిస్తోంది.
మార్చి 16న పెళ్లి. వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే పెళ్లి కుమారుడు మిస్సవడంతో అటు అబ్బాయి, ఇటు అమ్మాయి తరపు బంధువులు షాక్‌కు గురయ్యారు. అణువణువూ గాలించారు. స్థానికులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలతో వేట మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఎస్సాఎస్పీలో డెడ్‌బాడీ బయటపడింది.
హనుమకొండ టౌన్ గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన కృష్ణతేజ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. నర్సంపేటకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. మార్చి 16న పెళ్లి ముహూర్తం ఖరారు చేయగా.. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులు పంచేందుకు వెళ్లిన కృష్ణతేజ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఇంతలో SRSP కెనాల్ పక్కన అతడి బైక్‌ను బంధువులు గుర్తించారు. అనుమానంతో గజ ఈతగాళ్లతో గాలిస్తే డెడ్‌బాడీ కనిపించింది. అయితే అది ఆత్మహత్య.. లేక మరేవైనా కారణాలున్నాయి అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.