నిజామాబాద్ నగరానికి చెందిన యువతీ, యువకుడు నిర్మల్ జిల్లా బాసరలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ – నాగర్ సోల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిందపడి ఇద్దరు సూసైడ్ చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది.
నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన సూరం ప్రవీణ్(28), సీతారాంనగర్ కాలనీకి చెందిన నందిత(20)లు బాసర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రవీణ్ నగరంలోని పాంగ్రలో గల విశ్వభారతి ప్రైవేట్ పాఠశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.
నందిత నిశిత కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. నందిత కాలేజీలో చాలా మెరుగైన విద్యార్థి అని సహచర విద్యార్థులు తెలిపారు. యువకుడు ప్రవీణ్ సైతం సీన్సియర్ అని, వారి కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వీరిద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇద్దరి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. రైల్వే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఇరువురి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.