Mana Enadu:హైదరాబాద్ మహానగరం.. విశ్వనగరంగా మారుతోంది. ఇక్కడంతా ఉరుకుల పరుగుల జీవితమే. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు నగర వీధులు వాహనాలతో హోరెత్తిపోవాల్సిందే. అయితే ఎంతటి బిజీ లైఫ్ అయినా.. హైదరాబాదీలు భోజనం చేసేటప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ భుజిస్తుంటారు. అయితే ఇక్కడికి ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఇతర వ్యాపారాల కోసం పుట్టిన ఊరు నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లో బ్యాచిలర్స్ ఎక్కువ.
ఇక బ్యాచిలర్స్ సంగతి తెలిసిందే కదా. అయితే రైస్ పెట్టుకుని కర్రీస్ బయట నుంచి కొనుక్కోవడం.. మరీ బిజీగా ఉంటే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం. అయితే సాధారణంగా ఫుడ్ డెలివరీ అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఐటెమ్స్ లేక పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్ ఉంటాయనుకుంటాం. అనుకోవడం కాదు.. అవే ఎక్కువ ఉంటాయి. ఇక హైదరాబాద్ లో అయితే వాటి స్థానాన్ని హైదరాబాద్ దమ్ బిర్యానీ రీప్లేస్ చేస్తుంది. ఇప్పటికే మనం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లలో హైదరాబాద్ బిర్యానీ క్రియేట్ చేసిన రికార్డుల గురించి చాలా సార్లు తెలుసుకున్నాం. కానీ ఈ లెక్క తప్పని చెబుతున్నాయి తాజాగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ లెక్కలు.
దేశవ్యాప్తంగా ఉత్తమ వంటకాలు, వాటిని అందించే రెస్టారెంట్లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు గ్రీన్ డాట్ అవార్డుల పేరిట స్విగ్గీ ఓ కార్యక్రమానికి షురూ చేసింది. ఇందులో భాగంగా… తమకు వచ్చే ఆర్డర్లను అనలైజ్ చేసి ఓ రిపోర్టు రెడీ చేసింది. అయితే ఈ రిపోర్టులో ఆశ్చర్యకరంగా… స్విగ్గీకి అత్యధికంగా వచ్చే ఆర్డర్స్ లో టాప్ 10 వంటకాల్లో ఆరు శాకాహార వంటకాలే ఉన్నాయట. అందులోనూ ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ డిషెస్ అయిన మసాలా దోశ, ఇడ్లీ ఉన్నాయట. వీటితో పాటు పన్నీర్ బటర్ మసాలా, మార్గెరిటా పిజ్జా, పావ్ బాజీ ఉన్నాయని స్విగ్గీ రిపోర్ట్ చెబుతోంది.
ముఖ్యంగా వెజ్ ఫుడ్ ఆర్డర్స్ లో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో హైదరాబాద్ నగరం చోటు దక్కించుకుంది. మొదటి స్థానంలో బెంగళూరు, రెండో ప్లేసులో ముంబయి.. ఇక మూడో స్థానాన్ని మన హైదరాబాద్ దక్కించుకుంది. చికెన్ ధమ్ బిర్యానీకి కేరాఫ్ అడ్రస్ అయిన హైదరాబాద్ వెజ్ ఫుడ్ ఆర్డర్స్ లో టాప్ 3లో ఉండటం గమనార్హం.
అయితే భాగ్యనగర వాసులు ఎక్కువగా మసాలా దోస, ఇడ్లీ తినడానికి ఇష్టపడుతున్నారట. స్విగ్గీ రిపోర్టులో ఈ ఆర్డర్లే ఎక్కువగా ఉన్నాయట. మొత్తానికి మన హైదరాబాద్ చికెన్ బిర్యానీకే కాదు.. వెజ్ టేరియన్ ఫుడ్ ఆర్డర్లలోనూ టాప్ లో నిలిచిందన్నమాట. ప్లాట్ ఫామ్ లో 90 శాతం కంటే ఎక్కువ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్లు శాకాహారమే కాబట్టి.. దీన్ని “బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్స్ కి గోల్డెన్ అవర్” అని స్విగ్గీ అభివర్ణించింది.