Mpox: విజృంభిస్తోన్న ఎంపాక్స్.. కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం

Mana Enadu: గతంలో మంకీపాక్స్‌గా పిలుచుకున్న ఎంపాక్స్‌గా ఇప్పుడు మళ్లీ కలకలం సృష్టిస్తోంది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దాని చుట్టుపక్కల దేశాల్లో ఎంపాక్స్‌ విరుచుకుపడుతోంది. ఎంపాక్స్ లక్షణాలు, నివారణ చర్యలపై కనీస అవగాహన తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. మంకీపాక్స్‌పై భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దవాఖానాల్లో బెడ్‌లను రిజర్వ్‌ చేయడంతో పాటు ప్రధాన ల్యాబ్‌లను సైతం అప్రమత్తం చేసింది. వ్యాధి నిర్ధారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో రోగులకు ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది.

మార్గదర్శకాలు విడుదల

మంకీపాక్స్ అనుమానితుల చికిత్సకు ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు విడుదల చేసింది. జ్వరం, దద్దుర్లతో వచ్చినవారిని ఇతర పేషంట్లతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలంది. కండరాలు, నడుం నొప్పి, ఉబ్బిన నరాలు, వణుకుడు, అలసట, వెడల్పాటి దద్దుర్లను గుర్తించాలని పేర్కొంది. రీసెంటుగా మంకీపాక్స్ బాధితుల్ని కలిశారేమో కనుక్కోవాలని చెప్పింది. వీరి వివరాలను IDSPకి పంపాలని, వైద్య సిబ్బంది PPE కిట్లను ధరించాలని తెలిపింది.

టీకా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం: సీరమ్

మంకీపాక్స్‌కు టీకా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే సానుకూల ఫలితాలు చూస్తామని అంచనా వేసింది. ప్రమాదంలో పడ్డ లక్షల మంది కోసం వ్యాక్సిన్ తయారు చేస్తామంది. ఆందోళన కలిగిస్తున్న వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి భారత్‌లో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాధిపై ఇప్పటికే సూచనలు ఇచ్చింది.

ఎంపాక్స్ లక్షణాలివే..

ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, బలహీనపడటం ఎంపాక్స్ లక్షణాలు. ఇవి వైరస్ సోకిన 1-21రోజుల్లో ఎప్పుడైనా కనిపించవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువున్న వారిలో ఇది ఎక్కువకాలం ఉంటుంది. వైరస్ ఉన్న వారిని తాకడం, ముఖాముఖి మాట్లాడటం వల్ల వ్యాపిస్తుంది. ఈ లక్షణాలుంటే మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది.

Share post:

లేటెస్ట్