21 మెడల్స్‌తో పారాలింపిక్స్‌లో భారత్ నయా రికార్డు.. అథ్లెట్లతో పీఎం మోదీ స్పెషల్ ముచ్చట్లు

ManaEnadu:పారిస్​లో జరుగుతున్న పారాలింపిక్స్‌ (Paralympics)లో భారత్ రికార్డు సృష్టించింది. గత టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలను సాధించిన భారత అథ్లెట్లు.. ఇప్పుడా సంఖ్యను దాటేశారు. ఇప్పటి వరకు 20 పతకాలు సాధించగా తాజాగా ఈవాళ (సెప్టెంబరు 4వతేదీ 2024) మరో రజతం పతకం పొందడంతో ఆ సంఖ్య 21కి చేరింది. ఇంకా పతకాంశాలు మిగిలే ఉండటంతో టీమ్‌ఇండియా మెడల్స్ (Team India Paralympics 2024) మరిన్ని పెరిగే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అంటున్నారు.

పారాలింపిక్స్‌లో భారత్ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పారా అథ్లెట్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. బ్రూనై నుంచి సింగపూర్‌ పర్యటనకు బయల్దేరిన మోదీ బ్రూనైలో అధికారిక సమావేశాలు ముగిసిన అనంతరం అథ్లెట్ల(Athletes)తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ.. బరిలో నిలిచిన వారికి గుడ్ లక్ చెప్పారు. పతకాలు సాధించిన దీప్తి జీవాంజి, మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్, సుందర్ సింగ్‌ గుర్జార్, అజీత్ సింగ్ తదితరుల ప్రతిభను ప్రశంసించారు.

25 పతకాలే లక్ష్యంగా ఈసారి పారాలింపిక్స్‌ బరిలోకి దిగింది భారత్ (India Medals Paralympics). మొత్తం 84 మందితో కూడిన అథ్లెట్ల బృందం పారిస్‌కు వెళ్లింది. మొదటి రోజు నుంచి మెరుగైన ప్రదర్శనతో దేశానికి మెడల్స్ తీసుకొస్తోంది. పారాలింపిక్స్‌లో పతకాల వేటకు బరిలోకి దిగిన అథ్లెట్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లు కేటాయించింది. క్వాలిఫైడ్‌ అంశాల కోసం రూ. 74 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

పారిస్ పారాలింపిక్స్‌ (Paris Paralympics)లో భారత్‌కు ఇప్పటి వరకు 21 పతకాలు లభించాయి. ఇందులో మూడు బంగారు పతకాలు (Gold Medals), 7 వెండి మెడల్స్, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆగస్టు 28న ప్రారంభమైన పారిస్ పారాలింపిక్స్-2024 గేమ్స్ . సెప్టెంబర్ 8 వరకూ కొనసాగనున్నాయి. మరో నాలుగు రోజు ఉండటంతో కచ్చితంగా భారత్ నిర్దేశించిన 25 పతకాల లక్ష్యం చేరుతుందని క్రీడా నిపుణులు అంటున్నారు.

Share post:

లేటెస్ట్