Mana Enadu: చికెన్, చికెన్ బిర్యానీ, చికెన్ పకోడి.. అబ్బా ఈ పేర్లు వినగానే నోరూరుతుంది కదూ.. పైగా కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు రోజూ తింటుంటారు. అయితే చికెన్ వల్ల కలిగే లాభాలే కాకుండా చికెన్ వల్ల కలిగే నష్టాలూ కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం లేకపోలేదు. సాధారణంగా చికెన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ప్రోటీన్‌లకు ఇది పెట్టింది పేరు. అందుకే వారంలో ఒక్కసారైనా కోడి మాంసాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే అతిగా చికెన్ తిన్నా అనారోగ్యం బారిన పడతామట. సాధారణంగా చికెన్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల దానిని జీర్ణించుకోవడం కొంచెం కష్టమవుతుంది. దీంతోపాటు చికెన్లో కొన్నింటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేంటంటే..
సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం
చాలా మంది చికెన్‌ను స్కిన్‌తో తినడానికి ఇష్టపడుతుంటారు. నిజానికి స్కిన్ కూరకు రుచిని కూడా తీసుకొస్తుంది.అయితే కోడి మాంసాన్ని స్కిన్‌తో తినడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్కిన్‌లో కొవ్వు అధికంగా ఉండడమే దీనికి కారణమని అంటున్నారు. స్కిన్‌లోని కొవ్వు గుండెకు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే కొందరు చికెన్ షాపు యజమానులు చికెన్ నిత్యం ఫ్రెష్‌గా కనిపించాలనే ఉద్దేశంతో చర్మానికి రకరకాల రసాయనాలు పూస్తుంటారు. దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుందట. అవి శరీరంలోకి చేరడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. అలాగే చికెన్ లెగ్ పీస్‌ను వీలైనంత వరకు తగ్గించి తీసుకోవాలి. లెగ్ పీస్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పైగా బ్రాయిలర్ కోళ్లు త్వరగా ఎదిగేందుకు కొందరు కోడి తొడ భాగాల్లోనే ఇంజెక్షన్లు వంటివి ఇస్తుంటారు. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు.

గుండె సంబంధిత సమస్యలున్నవారు జాగ్రత్త
మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు, గుండె జబ్బుల నుంచి కోలుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో చికెన్‌ను స్కిన్‌తో తినకూడదని చెబుతున్నారు. చికెన్ స్కిన్‌లో అసంతృప్త కొవ్వులు, కేలరీలు ఎక్కువగా ఉంటాయని, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ప్రమాదకరమని సూచిస్తున్నారువారానికి రెండు మూడు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు కానీ, వారంలో 3 లేదా 4సార్ల కంటే ఎక్కువ సార్లు తింటే అటువంటి వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తప్పవు. అలాగే వండిన 24 గంటలలో చికెన్‌ను తినకపోతే హానికరమైన బ్యాక్టీరియాకు చికెన్ నిలయమవుతుంది.అంతే కాదండోయ్ చికెన్ ఎప్పుడు తిన్నా కేవలం కూరలా చేసుకొని తింటే మంచిది. ఫ్రై చేసుకుని తినకూడదు. ఎందుకంటే, అది శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ సోకేందుకు కారణం అవుతుందని పరిశోధనలు తేల్చాయి. ఇదండీ చికెన్ స్టోరీ.. ఇకపై చికెన్‌లో ఏ పార్ట్ తినాలో.. ఏం తినకూడదో నిర్ణయించుకోవాల్సింది మీరే.








