
దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ (X) సేవల్లో సోమవారం నుంచి అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విటర్ ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 3 సార్లు నిలిచిపోయాయని యూజర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. USA, ఇండియా, UK, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఎక్స్ సేవలకు అంతరాయం కలిగినట్లు 40 వేల మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తాజాగా ఎక్స్ CEO ఎలాన్ మస్క్(Elon Musk) స్పందించారు. ఎక్స్ సేవల్లో అంతరాయానికి కారణం సైబర్ దాడేనని స్పష్టం చేశారు.
ఎక్స్ పై సైబర్ దాడి జరిగిందన్న మస్క్
భారీ స్థాయిలో సైబర్ దాడి(Cyber Attack) జరిగిందని, దీని వెనుక ఉక్రెయిన్(Ukraine) హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని మస్క్ చెప్పారు. సైబర్ దాడికి పాల్పడిన దుండగుల ఐపీ అడ్రస్(IP address)లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని తెలిపారు. ఈ విషయంపై ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘Xపై సైబర్ దాడి జరిగింది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చు. ప్రస్తుతానికి దీనిపై కచ్చితంగా చెప్పలేను కానీ ఐపీ అడ్రస్‌లు మాత్రం ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని గుర్తించాం’ అని మస్క్ చెప్పారు.
మంగళవారం కూడా సేవల్లో అంతరాయం!
కాగా మార్చి 10న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తొలుత ఎక్స్ డౌన్ అయిందని, ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు ఈ సమస్య ఎదురైందని ‘డౌన్ డిటెక్టర్’ వెల్లడించింది. తర్వాత రాత్రి 7.30 గంటలకు, ఆపై రాత్రి 9 గంటలకు మళ్లీ సేవల్లో అంతరాయం నెలకొందని పేర్కొంది. ఎక్స్ యాప్ వాడుతున్న యూజర్లలో 56% మంది, వెబ్‌సైట్ వాడుతున్న వారిలో 33% మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారని తెలిపింది. తాజాగా మంగళవారం (మార్చి 11) ఉదయం కూడా పలుమార్లు ట్విటర్ ఖాతాలు నిలిచిపోయినట్లు వేల సంఖ్యలో ఫిర్యాదు చేస్తున్నారు.