హైదరాబాద్: ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడం రైతుల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది. గడిచిన ఎన్నికల ముందు పసుపు బోర్డు కోసం రైతులు ఆందోళనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నామినేషన్లు సైతం వేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు బాండ్ రాసిచ్చిన ధర్మపురి అర్వింద్ ఎంపీగా గెలిచాడు. చివరకు బోర్డు ప్రకటన రావడం.. మాట నిలబెట్టుకున్నట్టు కాగా.. పార్టీ ఉత్తర తెలంగాణలో బలపడుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
పసుపు పేరు చెబితే నిజామాబాద్ జిల్లానే గుర్తొస్తుంది. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పసుపు పంట సాగు చేస్తూ గుర్తింపు పొందారు. రాష్ర్టంలో ఎన్న ఏకైక పసుపు మార్కెట్ ఇందూరులోనే ఉంది. ప్రతి సంవత్సరం నిజామాబాద్ మార్కెట్కు 6లక్షల క్వింటాళ్లకు పైగానే పసుపు పంట వస్తుంది. జగిత్యాల, నిర్మల, వరంగల్ జిల్లాలోనూ పసుపు సాగువుతుంది. 35వేల ఎకరాలకు పైగానే పసుపు సాగును నిజామాబాద్లో జిల్లా నమోదు అవుతుంది.
పసుపు బోర్డు కోసం రైతులు పోరాటం ఉదృతం చేసిన తరుణంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను అస్ర్తంగా చేసుకున్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో 178 మంది రైతుల బరిలో దిగి లక్ష ఓట్లు సాధించారు. అదే సమయంలో బీజేపీ జాతీయ నాయకులు పసుపు బోర్డు ఇస్తామని హామీనిచ్చారు. కమలం అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని లేకుంటే రాజీనామా చేస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆ పోలింగ్ పోరులో అర్వింద్ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాల సంస్థ విస్తరణ కేంద్రాన్ని సాధించారు. జాతీయ పసుపు బోర్డు ప్రకటనపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు.