ఐపీఎల్​లో అన్​సోల్డ్​.. రిటైర్మెంట్​ ప్రకటించిన క్రికెటర్​

టీమిండియాకు, ఐపీఎల్​లో హైదరాబాద్​ జట్టుకు సేవలందించిన పేసర్​ సిద్ధార్థ్​ కౌల్​ (Siddarth Kaul) అకస్మాత్తుగా రిటైర్మెంట్​ ప్రకటించాడు. 2025 ఐపీఎల్​ సీజన్​ కోసం కొద్దిరోజుల క్రితం నిర్వహించిన వేలంలో (IPL Auction 2025) అతడు అమ్ముడు పోలేదు. ఈ నేపథ్యంలోనే అతడు రిటైర్మెంట్​ ప్రకటించడం చర్చకు దారి తీసింది.

క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. ‘చిన్నప్పుడు పంజాబ్‌లోని పొలాల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు నాకు ఒక కల ఉండేది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని. దేవుని దయతో నేను 2018లో టీ20 జట్టులో చోటు సంపాదించాను. నా భారత క్యాప్ నంబర్ 75. వన్డే జట్టులో క్యాప్ నంబర్ 221 అందుకున్నాను. దేశానికి నా సమయం కేటాయించాను. నా రిటైర్‌మెంట్‌ను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ వెల్లడించాడు.

టీమిండియా తరఫున 3 వన్డేలు, 3 టీ20లు ఆడిన కౌల్.. ఓవరాల్‌గా 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన అరకొర ఛాన్సుల్ని సద్వినియోగం చేసుకోకపోయాడు. దీనికి తోడు టీమ్‌లో బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ ఉండటంతో కౌల్ తిరిగి కమ్‌బ్యాక్ చేయలేకపోయాడు. ఇంటర్నేషనల్ లెవల్‌లో పెద్దగా ఆడకపోయినా దేశవాళీల్లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. 88 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 297 వికెట్లతో ఉత్తమ బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు. లిస్ట్‌-ఏలో 111 మ్యాచుల్లో 199 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో (IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ఫ్రాంచైజీ తరఫున 2018 నుంచి 2021 వరకు ఆడాడు. ఇటీవల జరిగిన మెగా ఆక్షన్‌లో అతడ్ని ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడంతో కౌల్ రిటైర్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.

Share post:

లేటెస్ట్