హైదరాబాద్: క్షేత్రస్థాయిలో వేళ్లూనుకున్న అభిమానం, ఏళ్లుగా జనానికి అంటిపెట్టుకుని చేసిన సేవాకార్యక్రమాలతో కలిసొచ్చిన చరిష్మాతో పాటు వెన్నంటి నడుస్తున్న గులాబీ దళంతో ఉప్పల్ నియోజకవర్గంలో బండారు లక్ష్మారెడ్డి గెలుపు లాంఛనంగా కనిపిస్తోంది. మరోవైపు ఇంకా అభ్యర్థులను తేల్చుకోలేని పరిస్థితిలో ఇతర పార్టీలు ఉండటం సైతం మరోరకంగా కలిసొస్తోంది. ఈ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో భారాస గెలిచింది. ఇక్కడి నుంచి సిట్టింగ్ అభ్యర్థిని మార్చి స్థానికంగా జనంలో మంచిపేరున్న, బలమైన నేత బండారు లక్ష్మారెడ్డిని అధినేత కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్న బీఎల్ఆర్ అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేస్తున్నారు.
వ్యక్తిగత ఇమేజ్ కలిసొస్తుందా..?
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇతర నేతలకు భిన్నంగా బీఎల్ఆర్ ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఎప్పడూ జనాన్ని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు ఆర్థికంగా సాయమందించి వెన్నంటి నిలిచారు.
దీనికి తోడు రెండోశ్రేణి పార్టీ నేతలకు అన్నివేళలా అందుబాటులో ఉండటం, అన్నింటికి నిలబడటం కూడా మరింత బలంగా మారింది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మాజీ మేయర్, మరికొందరు నేతలూ సీటు కోసం పోటీ పడినా.. క్షేత్రస్థాయిలో బలమైన నేతగా ఉన్న బీఎల్ఆర్ వైపే అధినేత మొగ్గు చూపారు. అంతా మూకుమ్మడిగా ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, భాజపా.. తేలిపోతాయా..?
కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు మందముల పరమేశ్వర్ రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి తో పాటు రాగిడి లక్ష్మారెడ్డి టిక్కెట్టు రేసులో ఉన్నారు. స్థానికంగా పార్టీకి క్యాడర్ ఉన్నా పైస్థాయి నేతల మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు తొలిసారి భాజపా నుంచి దాదాపు 40 దరఖాస్తులు ఎమ్మెల్యే సీటు కోసం వచ్చాయి.
ఇక్కడ కొన్నేళ్లుగా పోటీకి నిలబడుతున్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్థానిక నేతలకు అందుబాటులో ఉండకపోగా.. ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారంటూ అసంతృప్తితో ఉన్న నలభై మంది ఇక్కడి నుంచి పోటీకి తామంటే తామని సిద్ధంగా ఉన్నారు. వీరిలో సీటు ఎన్వీఎస్ఎస్ కే దాదాపుగా ఖరారయ్యే అవకాశాలుండగా.. ఈ సమీకరణాలు భారాస అభ్యర్థికి రెట్టింపు బలంగా మారనున్నాయి.