
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట శివారులో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు పనుల్లో ఈనెల 22వ తేదీ ఉదయం సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజులు గడిచినా ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల జాడ.. తెలియరాలేదు. వారిని రక్షించేందుకు నాలుగో రోజూ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటరు వద్దకు చేరుకునేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 13 కిలోమీటర్ల వరకూ లోకో ట్రైన్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.
11 కిలోమీటర్ల వరకూ లోకో ట్రైన్‌లో వెళ్లి, అక్కడి నుంచి నీరుండటంతో కన్వేయర్ బెల్టు పైనుంచి గతంలో రాకపోకలు సాగించారు. ప్రస్తుతం అక్కడ కన్వేయర్ బెల్టు తెగిపోయింది. ఇక అక్కడ్నుంచి నీటిమట్టం పెరుగుతూ సుమారు 200 మీటర్ల వరకూ మోకాళ్ల లోతు వరకూ బురద ఉండటం.. దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ అవశేషాలు ఉండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా మారాయి. ఈ బురద, టీబీఎం అవశేషాలను తొలగించి, 200 మీటర్ల బురదను దాటితేనే చిక్కుకుపోయిన కార్మికులు ఉన్న టీబీఎం ముందుకు చేరుకోవచ్చని రెస్క్యూ టీమ్ చెబుతోంది.
కానీ కాలు మోపితే శరీరం నడుము లోతు బురదలో కూరుకుపోతుండటంతో వెదురుబొంగులతో చేసిన నిచ్చెనలు, ధర్మకోల్ షీట్లతో తయారు చేసిన తెప్పలతో రెస్క్యూ టీమ్ నెమ్మదిగా బురదను దాటే ప్రయత్నం చేస్తోంది. ప్రమాద స్థలిని చేరుకునేందుకు 40 మీటర్ల వరకూ బురదలో ముందుకు వెళ్లాల్సి ఉండటంతో.. అక్కడకు చేరుకునేందుకు డ్రోన్ల సాయంతో తీసుకోనుంది. సొరంగ మార్గంలో ప్రస్తుతం ఎలాంటి సమాచార వ్యవస్థ లేదు. సోమవారం మధ్యాహ్నం లోపలికి వెళ్లిన రెస్క్యూ టీమ్.. జీపీఐ యాంటెనా సిగ్నల్స్ పనితీరును పరిశీలించే పరికరాలన్నీ లోపలికి తీసుకువెళ్లాయి. ఈ టీమ్స్ బయటకు వస్తేనే సహాయక చర్యల్లో పురోగతిపై క్లారిటీ వస్తుంది.
ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి కాలనీస్, హైడ్రా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఇలా అనేక రంగాల్లో నిపుణులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియాలంటే మరిన్ని రోజులు పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు వారు ఎక్కడున్నారో.. క్షేమంగా ఉన్నారో లేదో.. సురక్షితంగా బయటకు వస్తారో లేదోనని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.