ManaEnadu:యూకే (బ్రిటన్) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. జగన్ పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు విజయసాయి రెడ్డి పిటిషన్‌పై తీర్పును 30వ తేదీకి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు మొదటి వారంలో యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లడానికి అనుమతించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేయగా.. తిరిగి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరడంతో ఈనెల 27కు తన నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డి కోరగా.. ఆయనకూ అనుమతివ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తరచూ విదేశాలు, ఇతర నగరాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లొచ్చిన ఆయన ఆ తర్వాత పలుమార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు.